నల్గొండ  జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆలయ ఈవో, అర్చకులు 

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు జరిగే స్వర్ణ విమాన గోపుర మహాకుంబాభిషేకానికి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ ఈవో భాస్కర్ రావు ఆహ్వాన పత్రిక అందజేశారు. శనివారం సెక్రటేరియట్ లోని సీఎం ఛాంబర్ లో ఎండోమెంట్ మినిష్టర్ కొండా సురేఖతో కలిసి ఆలయ ఈవో, అర్చకులు సీఎం రేవంత్ ను కలిశారు. యాదగిరిగుట్ట దేవస్థానంలో గర్భగుడిపై ఉన్న దివ్యవిమాన గోపురానికి బంగారు తొడుగులు అమర్చే పనులు శరవేగంగా జరుగుతున్నాయని సీఎంకు ఈవో వివరించారు. ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలతో మహా కుంబాభిషేకం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామివారి లడ్డూప్రసాదం అందజేశారు. 

మృతుడి కుటుంబానికి పరామర్శ 

హాలియా, వెలుగు : అనుముల మండలం మధారిగూడెం గ్రామానికి చెందిన రైతు సంఘం నాయకుడు రిక్కల వాసుదేవారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్​రెడ్డి, మాజీ సీఎల్పీ లీడర్ కుందూరు జానారెడ్డి శనివారం గ్రామానికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం నాగార్జునసాగర్ తన క్యాంపు కార్యాలయంలో అనుముల, పెద్దవూర, నిడమానూరు, తిరుమలగిరిసాగర్ మండలాల టీఎస్ పీఆర్టీయూ-2025 క్యాలెండర్​ను ఎమ్మెల్యే జైవీర్​రెడ్డి ఆవిష్కరించారు. 

దేనిని వృధా చేయొద్దు

యాదాద్రి, వెలుగు : ప్రతి వస్తువుతో ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని, ఏ వస్తువును వృధాగా పడేయొద్దని డీఈవో సత్యనారాయణ సూచించారు. శనివారం భువనగిరిలో 'వేస్ట్ టు వెల్త్' అంశంపై నిర్వహించిన ప్రదర్శనలో జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేయబడిన 60 పాఠశాలల నుంచి 120 మంది విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చారు. తాము తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఉపయోగకరమైన వస్తువులను తయారు చేయడం మొదటి నుండే అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం మంచి వస్తువులు తయారు చేసినవ వారికి బహుమతులు అందజేశారు.  

బ్యాంక్ పనితీరుపై రిపోర్ట్ 

నల్గొండ అర్బన్, వెలుగు : జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ 2022-–-24లో  బ్యాంకు పని తీరుపై నాబార్డ్ గుడ్ రిపోర్ట్ ఇచ్చిందని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నల్గొండలోని నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లో బోర్డు కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ మాట్లాడుతూ బ్యాంకు ఎకౌంటింగ్ పరంగా అన్ని విధాలా సరిగ్గానే ఉన్నావని, ఏమైనా చిన్నచిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేసుకొని ముందుకు సాగుతామని చెప్పారు. సమావేశంలో డీసీసీబీ వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి, పాలకవర్గ డైరెక్టర్లు, బ్యాంకు సీఈవో శంకర్ రావు, నాబార్డ్ డీడీఎమ్, సిబ్బంది పాల్గొన్నారు. 

రోడ్​ సేఫ్టీ పాటించాలి

కోదాడ, వెలుగు : ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఎంవీఐ రాజ్ మహమ్మద్ సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా శనివారం కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద గల అంతర్రాష్ట్ర రవాణా శాఖ చెక్ పోస్ట్ ఆవరణలో వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు, వివిధ వాహనాల డ్రైవర్లు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలన్నారు.